మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ ఒకేదశలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే కేవలం 81 అసెంబ్లీ స్థానాలున్నటువంటి జార్ఖండ్ లో మాత్రం రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడం గమనార్హం. తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. మహారాష్ట్రలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ 22, 2024న నోటిఫికేషన్. నామినేషన్ చివరి తేదీ అక్టోబర్ 29. అక్టోబర్ 30న స్క్రూటినీ. నవంబర్ 4న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ. నవంబర్ 20న పోలింగ్. నవంబర్ 23న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
అలాగే జార్ఖండ్ లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 13, రెండో దశ నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 23న రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించారు. జార్ఖండ్ లో కొన్ని నక్సల్స్ ఏరియా ఉండటం వల్ల రెండు విడుతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు.