ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిందని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. ఈ ఆలయం వచ్చే జనవరిలో సంక్రాంతికి భక్తులకు అందుబాటులోకి వస్తుందని.. సంక్రాంతి పర్వదినం (జనవరి 14) నుంచి జనవరి 24 వరకు అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పది రోజుల పాటు వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జనవరి 24న భక్తులకు ఆలయంలోకి అనుమతించనున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠ ప్రక్రియను మకర సంక్రాంతికి ప్రారంభించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించిందని తెలిపారు.
విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 14న ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. పంచాంగంలో మంచి గడియలను చూసి ఈ తేదీని ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాముడి విగ్రహం ప్రతిష్ఠించేందుకు జ్యోతిషులు నాలుగు తేదీలను సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 21, 22, 24, 25 తేదీలు రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూలమని తేల్చినట్లు వెల్లడించాయి.