అయోధ్య రామమందిరంలో మరికొన్ని గంటల్లో బాలరాముడు కొలువుదీరనున్నారు. ఎన్నో ఏళ్ల కల సాకారమవుతున్న వేళ రామాలయ నిర్మాణంలో భాగంగా ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు మొదలై ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని శ్రీరాముడి విగ్రహ నుదుటిపై ప్రసరించేలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీన్నే రాముడికి ‘సూర్య తిలకం’గా పిలుస్తున్నారు. మరి ఈ సూర్యతిలకం విశిష్టత ఏంటి? దీనికోసం ఏ టెక్నాలజీ వినియోగించారో తెలుసుకుందాం.
సూర్యతిలకం కోసం సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న ‘సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ప్రత్యేక వ్యవస్థను రూపొందించి దాని కోసం‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ’ సాయం తీసుకుంది. దీనికి కావాల్సిన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆప్టిక్స్’ సంస్థ తయారు చేసింది. ప్రతి ఏడాది రామనవమి పర్వదినాన మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలు రాముడి నుదుటిపై ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలు రూపొందించారు. మూడో అంతస్తు నుంచి సూర్యకిరణాలు గర్భగుడిలోని విగ్రహం వరకు ప్రసరించేలా వీటిని అమర్చినట్లు రామమందిర నిర్మాణ అధికారులు తెలిపారు.