భారతీయులందరూ చైనీస్ ఫుడ్‌ను నిషేధించాలని కేంద్రమంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ-ఏ) నేత రామ్‌దాస్ అథవాలే అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దేశ పౌరులు చైనా ఫుడ్‌ను తినకూడదని, ఆ ఆహారాలను నిషేధించాలని అన్నారు. అలాగే చైనీస్ ఫుడ్‌ను అమ్మే రెస్టారెంట్లను బ్యాన్ చేయాలని అన్నారు.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్లను పొట్టన పెట్టుకున్నందుకు గాను చైనా ఆర్మీపై, ఆ దేశంపై భారతీయులు మండిపడుతున్నారు. ఆ దేశ వస్తువులను బ్యాన్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఆ దేశంలో తయారైన లేదా ఆ దేశానికి సంబంధం ఉన్న వస్తువులేవీ ఇండియాలో కనిపించకూడదని, వాటిని వాడకూడదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అథవాలే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా చైనా ఫుడ్‌ను మాత్రమే కాదు, అక్కడి సాహిత్యాన్ని కూడా భారత్‌లో నిషేధించాలని అథవాలే అన్నారు. చైనా సరిహద్దులో పాల్పడుతున్న చర్యలపై పునరాలోచన చేయాలని, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ”మీరు మా నుంచి బుద్ధున్ని దూరం చేశారు.. అయినా మేం మీతో యుద్ధాన్ని కోరుకోవడం లేదు.. యుద్ధం వల్ల ఇరు దేశాలు భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంతో మంది చనిపోతారు. ఎంతో ఆస్తినష్టం కలుగుతుంది. మేం సరిహద్దు దాటడం లేదు, కానీ మీరెందుకు ఆ పనిచేస్తున్నారు ?” అంటూ ఆయన చైనాపై నిప్పులు చెరిగారు.