ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా జనాలకు అధిక మొత్తంలో వడ్డీలకు డబ్బులను అప్పులుగా ఇస్తూ పలు యాప్‌లు వారిని పీడిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి యాప్‌ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. అయితే వీరు చాలదన్నట్లు కొందరు రుణాలను ఇస్తామంటూ నకిలీ యాప్‌లను సృష్టించి జనాలను మోసం చేస్తున్నారు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి కొందరు దుండగులు తక్కువ వడ్డీకే భారీ మొత్తంలో ఎలాంటి షరతులు లేకుండానే రుణాలను ఇస్తామని చెబుతూ ఆశ చూపిస్తున్నారు. దీంతో నిజమే అని నమ్మేవారు ఆ యాప్‌లలో తమ పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. తరువాత లోన్ కావాలంటే కొద్ది మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజును ముందుగానే చెల్లించాలని యాప్‌లు అడుగుతున్నాయి. నిజమే కాబోలునని కొందరు చెల్లిస్తున్నారు. అయితే ఫీజు చెల్లించినా ఆ యాప్‌ల నుంచి ఎలాంటి స్పందనా ఉండడం లేదు. దీంతో ఆ యాప్‌లు నకిలీవని, జనాల నుంచి అలా డబ్బులను వసూలు చేస్తూ మోసం చేయడమే వారి పని అని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇలా మోసం చేస్తున్న యాప్‌లు కూడా భారీగా పెరిగిపోయాయి.
ఇక కొన్ని యాప్‌లలోనైతే వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకింగ్ సమాచారాన్ని కూడా సేకరించి జనాలకు చెందిన అకౌంట్ల నుంచి డబ్బులను కాజేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు కూడా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఎస్‌బీఐ ఇలాంటి యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన కస్టమర్లను హెచ్చరించింది. అలాగే ఎస్‌బీఐ పేరిట ఎవరైనా లోన్లను ఇస్తామని చెబుతూ లింక్‌లను పంపించినా నమ్మకూడదని, ప్రజలు తమకు అవసరం ఉంటే అధికారిక ఎస్‌బీఐ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, లేదా సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు రావచ్చని, తమ అవసరాలను తీర్చుకోవచ్చని ఎస్‌బీఐ సూచించింది. తమ బ్యాంక్ పేరిట లోన్లను ఇస్తామని చెప్పే వారిని నమ్మకూడదని హెచ్చరికలు జారీ చేసింది.