‘భారత్‌’ బ్రాండ్‌ బియ్యం.. కిలో రూ.25కే!

-

ఆహార పదార్థాలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘భారత్‌’ బ్రాండ్‌ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇక నుంచి బియ్యాన్ని కూడా డిస్కౌంట్‌ ధరకు విక్రయించాలని కేంద్ర సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే భారత్ రైస్ అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. కిలో భారత్ రైస్ రూ.25కే విక్రయించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా రిటైల్‌ స్టోర్లలో సగటున కిలో బియ్యం ధర క్రితం ఏడాదితో పోలిస్తే 14.1శాతం పెరగడంతో సామాన్యులకు అందుబాటు ధరలో బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాఫెడ్‌, ఎన్‌సీసీఎఫ్‌, కేంద్రియ భండార్‌, మొబైల్‌ వ్యాన్ల ద్వారా రాయితీ ధరకు బియ్యం విక్రయాలు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత్‌ బ్రాండ్‌ కింద రూ.60కే కిలో శనగపప్పు, రూ.27.50కే కిలో గోధుమ పిండిని విక్రయిస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని 2వేల రిటైల్‌ పాయింట్లలో వీటిని విక్రయిస్తున్నారు. వీటిలాగే ‘భారత్‌ రైస్‌’ విక్రయాలు కూడా చేపట్టనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news