రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ ట్రక్కు.. ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టడం వల్ల ఇవాళ వేకువజామున ఈ దుర్ఘటన జరిగింది. అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లో మథురకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. జైపుర్- ఆగ్రా హైవేపై లఖన్‌పుర్ ప్రాంతంలో ఆగి ఉన్న బస్సును లఖన్‌పుర్ ప్రాంతంలో ట్రక్కు ఢీ కొట్టిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు పురుషులు, ఆరుగురు మహిళలు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతులను అంతు, నంద్రం, లల్లూ, భరత్, లాల్జీ, అతని భార్య మధుబెన్, అంబాబెన్, కంబుబెన్, రాముబెన్, అంజుబెన్, మధుబెన్‌గా పోలీసులు గుర్తించారు. మృతులందరూ గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందినవారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.