ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ బిహార్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. బుధవారం రోజున నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అనంతరం ఈ తీర్మానం గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.
బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించిందని సీఎం నితీశ్ తెలిపారు. 94 లక్షల నిరుపేద కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తామని.. గుడిసెల్లో నివసించే 39 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం రూ.1.20 లక్షలు చొప్పున ఇస్తామన్న నితీశ్.. స్థలం లేని కుటుంబాల కోసం తొలుత రూ.60వేలు ఇవ్వాలని అనుకున్నట్లు వివరించారు. అయితే దానిని ఇప్పుడు లక్ష రూపాయాలకు పెంచాలని నిర్ణయించామని.. దీని వల్ల 63,850 మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈ పథకాల అమలుకు సుమారు రూ.2.50 లక్షల కోట్లు అవుతుందని బిహార్ ప్రభుత్వం అంచనా వేసింది. వీటిని ఐదేళ్ల లోపు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ప్రత్యేక హోదా ఇస్తే.. వీటిని పూర్తి చేయడానికి తక్కువ సమయం పడుతుందని నితీశ్ కుమార్ అన్నారు.