బిహార్‌లో కులగణన సర్వే నివేదికను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో 63 శాతం ఓబీసీ (ఇతర వెనకబడిన తరగతులు), ఈబీసీ(అత్యంత వెనకబడిన తరగతుల) వారు కలిపి ఉన్నట్లు ఈ నివేదికలో తేలింది. ఈ రిపోర్టును ఇవాళ.. రాష్ట్ర డెవలప్‌మెంట్ కమిషనర్ వివేక్ సింగ్ విడుదల చేశారు.
ఈ నివేదిక ప్రకారం బిహార్ రాష్ట్ర జనాభా దాదాపు 13.07 కోట్లు.. వీరిలో అత్యంత వెనుబడిన తరగతుల (ఈబీసీలు) 36 శాతం.. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) 27.13 శాతంగా తేలింది. కులాలవారీగా చూస్తే ఓబీసీ వర్గానికి చెందిన యాదవుల జనాభా అత్యధికంగా ఉందని.. మొత్తం రాష్ట్ర జనాభాలో వీరి వాటా 14.27 శాతంగా ఉన్నట్లు వివేక్ సింగ్ తెలిపారు. షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) జనాభా 19.7 శాతం, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీలు) జనాభా 1.7 శాతంగా.. జనరల్ కేటగిరీకి చెందినవారి జనాభా 15.5 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్రం ప్రభుత్వం తేల్చి చెప్పడంతో.. తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ గతేడాది జూన్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కులాలవారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభవ్వగా.. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో, రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు.