బుధవారం హర్యానాలోని సోనీపట్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్యానాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపికి ప్రజల మద్దతు పెరుగుతుందని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ కు ఆశలు సన్నగిల్లుతున్నాయన్నారు. కాంగ్రెస్ రాజ కుటుంబం దేశంలోని అత్యంత అవినీతి కుటుంబం అని ఆరోపించారు మోడీ.
పార్టీ హై కమాండ్ అవినీతికి పాల్పడినప్పుడు కింద దోచుకోవడానికి ఓపెన్ లైసెన్స్ ఉంటుందన్నారు. పదేళ్ల క్రితం హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రాన్ని అల్లుడు, దళారులకు అప్పగించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎక్కడ అడుగుపెట్టినా అవినీతి, బంధుప్రీతి తప్పవని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వ హయాంలో హర్యానా నేడు వ్యవసాయం, పరిశ్రమల పరంగా దేశంలోని అగ్రరాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉందని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వృద్ధితోనే దళితులు, పేదల సాధికారత ముడిపడి ఉందని అంబేద్కర్ పేర్కొన్నారని తెలిపారు.