ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రయాణం చేస్తున్న సమయంలో భోజనంలో భాగంగా తేజస్వీ చేప తింటూ తీసుకున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ అధ్యక్షుడు ముకేశ్ సాహ్నీతో కలిసి హెలికాప్టర్‌లో ప్రయాణించిన తేజస్వీ భోజనం చేయడం కనిపించింది. యాదవులు, సంప్రదాయంగా చేపలు పట్టే వృత్తిలో ఉండే ‘నిషాద్’ సామాజికవర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ఇద్దరు నేతలు ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వీడియో తీశారు. కానీ దీనిపై బీజేపీ నాయకులు, కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వసంత నవరాత్రి సమయంలో నాన్ వెజ్ ఏంటి అంటూ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్ ‘సీజనల్ సనాతన వాదని’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఆ విమర్శలపై స్పందించిన బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి.. వసంత నవరాత్రికి ముందే చిత్రీకిరించిన వీడియో అది అని తెలిపారు. తన పేరు చెడగొట్టేందుకు ప్రయత్నించేవారి తెలివి తక్కువతనాన్ని బహిర్గతం చేయడంలో విజయం సాధించానని వ్యాఖ్యానించారు.