రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. 200 స్థానాల్లో 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా 115 స్థానాలకు బీజేపీ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక్కడ 70 స్థానాలకు పరిమితం కాగా.. 14 నియోజకవర్గాల్లో ఇతరులు గెలిచారు. ఈ ఫలితాల్లో మొదటి నుంచీ ఆధిక్యం కనబరిచిన కాషాయ పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అయితే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తుందనే దానిపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి రేసులో ప్రధానంగా నాలుగు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రేసులో వసుంధరా రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, బాలక్ నాథ్, దియా కుమారి ఉన్నారు.
వీళ్లతోపాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్షనేత రాజేంద్ర రాథోర్, రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సతీశ్ పునియా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, వీళ్లలో సీఎం అయ్యే అదృష్టం ఎవరికి ఉందో పార్టీ అధిష్ఠానం నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.