నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. అది మనుషుల ప్రాథమిక అవసరమని అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా అర్ధరాత్రి తర్వాత వాంగ్మూలాన్ని రికార్డు చేసే పద్ధతిని నిరాకరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. పగటిపూట మాత్రమే వాంగ్మూలాలను రికార్డు చేయాలని సూచించింది. పిటిషనర్ సమ్మతించినప్పటికీ.. తర్వాత రోజో లేక మరో సారో ఆ వ్యక్తిని విచారణకు పిలిచి ఉండాల్సిందని ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది.
మనీలాండరింగ్ కేసులో భాగంగా గత ఏడాది ఆగస్టులో 64 ఏళ్ల రామ్ ఇస్రానీని దర్యాప్తు సంస్థ అరెస్టు చేయగా.. దానిని సవాలు చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు. గత ఆగస్టు 7వ తేదీన అధికారులు తనను రాత్రి అంతా విచారించి మర్నాడు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం.. ఇస్రానీ పిటిషన్‌ను తోసి పుచ్చుతూ.. అతడిని రాత్రి అంతా ప్రశ్నించడాన్ని మాత్రం తప్పు పట్టింది.