భారతదేశం దుర్భర పేదరికాన్ని నిర్మూలించిందని విఖ్యాత అమెరికన్ విశ్లేషణ సంస్థ బ్రూకింగ్స్ అధ్యయనం వెల్లడించింది. 2011-12లో దేశ జనాభాలో 12.2 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉండగా 2022-23లో వారి సంఖ్య 2 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది. 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా ఆర్థిక వేత్తలు సూర్జిత్ భల్లా, కరణ్ భాసిన్ ఈ అధ్యయనం చేశారు.
భారత్‌లో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9 శాతం చొప్పున పెరుగుతూ రాగా.. గ్రామీణ పేదరికం 2.5 శాతానికి, పట్టణ పేదరికం ఒక శాతానికి తగ్గాయి. మరోవైపు గ్రామీణ, పట్టణ అసమానతలు కూడా తగ్గిపోయాయి. గినీ సూచి ప్రకారం 100 పాయింట్లు అత్యధిక అసమానతను సూచిస్తాయి. భారత్‌లో పట్టణ గినీ సూచి 36.7 నుంచి 31.9కీ, గ్రామీణ గినీ సూచి 28.7 నుంచి 27కూ తగ్గిందని ఈ అధ్యయనం తెలిపింది. అధిక ఆర్థికాభివృద్ధి రేటు, అసమానతల తగ్గుదల కలగలసి భారత్‌లో పేదరికాన్ని నిర్మూలిస్తున్నాయని వివరించింది.