బీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో తిరుగులేని పార్టీగా అభివృద్ధి చేయాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. మొదట మహారాష్ట్ర నుంచి ఈ పార్టీ జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని షురూ చేశారు. ఇప్పటికే పలు మార్లు బహిరంగ సభలు నిర్వహించి అక్కడి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో తెలంగాణ సరిహద్దులో ఉన్న గ్రామాల నాయకుల్లో చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇక తాజాగా బీఆర్‌ఎస్ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తోంది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తోంది. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. 15న ఉదయం నాగపూర్ వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు. ముంబయి, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీసుల ఏర్పాటుకు నిర్ణయించారు.