సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ అంశంపై నూతన నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ (ఎన్‌సీఎఫ్) చేసిన సిఫార్సులను ఎలా అమలు చేయాలనే దానిపై కసరత్తు చేస్తోంది. అయితే విభిన్న వాతావరణ పరిస్థితులు, భౌగోళిక వైరుధ్యాలు కలిగిన మన దేశంలో ఈ ప్రతిపాదన అమలు అంత సులభం కాదని సీబీఎస్ఈ అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పరీక్షలను సెమిస్టర్ విధానంలో నిర్వహించడంపైనా చర్చించినట్లు సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. పాటుగా జనవరి-ఫిబ్రవరిలో సీబీఎస్‌ఈ మొదటి బోర్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించి, మార్చి – ఏప్రిల్ లేదా జూన్‌లో రెండో బోర్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించేందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇవి ఫైనల్ ప్రతిపాదన కాదని, చర్చలు చేసే క్రమంలో మరిన్ని కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే విద్యార్థులు రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. వారికి మొదటిసారే ఎక్కువ మార్కులు వస్తే అంతటితో ఆగిపోవచ్చు.