ఆధ్యాత్మిక పర్యటకంపై సైబర్ కేటుగాళ్ల కన్ను పడింది. యాత్రికులే లక్ష్యంగా నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. పర్యటకానికి సంబంధించి సేవలందిస్తున్న పేరుతో నకిలీ వెబ్ సైట్లు క్రియేట్ చేసి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, వాట్సాప్ లలో మెసేజులు పంపుతున్నారు. ముఖ్యంగా బద్రినాథ్, కేదార్ నాథ్ యాత్రికులపై స్పెషల్ ఫోకస్ చేసి హెలికాప్టర్ బుకింగ్స్, ఛార్ దామ్ యాత్రికులకు హోటల్ బుకింగ్స్, ఆన్ లైన్ క్యాబ్స్, హాలిడే ప్యాకేజీల పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ విషయం కాస్త కేంద్ర ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఈ తరహా మోసాలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఏదైనా యాత్రకు వెళ్లాలనుకుంటున్న వారు మోసపూరిత వెబ్‌సైట్లను నమ్మొద్దని.. ‘స్పాన్సర్డ్ పేరుతో ఉండే లింకులు, ఫేస్‌బుక్, వాట్సప్‌లో వచ్చే లింకులను క్లిక్ చేసే ముందు అవి అసలైనావా? నకిలీవా? చెక్ చేసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల, నమ్మదగిన ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాలని పేర్కొంది. ఇలాంటి ఘటనలు దృష్టికి వస్తే cybercrime.gov.in పోర్టల్‌లో లేదా 1930కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలని చెప్పింది.