దేశంలోని సైనిక్ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని కోరారు. ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో పని చేస్తున్న 33 సైనిక్ స్కూళ్లకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుందని, ఒక సిద్ధాంతాన్ని వీటి ద్వారా విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నించడం తగదని తెలిపారు. దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఆరోపణలను రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ‘ఏ రాజకీయ, సైద్ధాంతిక సంస్థలు ఈ ఎంపిక ప్రక్రియ ప్రభావితం చేయవని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వచ్చిన ఆరోపణలు అసంబద్ధమైనమని ఖర్గే వ్యాఖ్యలను తోసిపుచ్చింది.