ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. ఇక నుంచి ఆలస్యంగా వస్తే కఠినచర్యలు

-

కార్యాలయానికి తరచూ ఆలస్యంగా వచ్చే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలస్యంగా రావడమే గాకుండా నిర్ణీత పనివేళలు ముగియకముందే వెళ్లిపోతున్న ఉద్యోగుల విషయాన్ని ఇక నుంచి తీవ్రంగా పరిగణించనుంది. ఇలాంటి వారిపై సంబంధిత అధికారులు కఠినంగా వ్యవహరించాలని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఆధార్‌తో అనుసంధానమైన బయోమెట్రిక్‌ వ్యవస్థలో పలువురు ఉద్యోగులు తమ హాజరు నమోదు చేయడం లేదని, మరికొందరు తరచూ ఆలస్యమవుతున్నారని గుర్తించినట్లు ఆ శాఖ తెలిపింది. మొబైల్‌ ఫోన్‌ ఆధారిత ముఖ గుర్తింపు వ్యవస్థను వాడి ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని తెలిపింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికల్ని పర్యవేక్షించాలని పేర్కొంది. ఆలస్యంగా వచ్చిన ఒక్కో రోజుకు ఒకపూట సాధారణ సెలవు (సీఎల్‌) చొప్పున కోత పెట్టాలని అధికారులకు సూచించింది. ఒకవేళ సీఎల్‌లు లేకపోతే ఆర్జిత సెలవుల నుంచి తగ్గించాలని.. తగిన కారణాలు ఉన్నట్లయితే మాత్రం నెలలో గరిష్ఠంగా రెండుసార్లు, రోజుకు గంటకు మించకుండా ఆలస్యంగా రావడాన్ని క్షమించవచ్చని  తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news