ప్రస్తుతం భారత్ లో ప్రతి ఒక్కరిని ఇబ్బందికి గురి చేస్తున్న సమస్య టమాట ధరల పెరుగుదల. రోజురోజుకు ఈ ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇప్పట్లో తగ్గే అవకాశం కూడా కనిపించడం లేదు. తాజాగా ఈ విషయంపై కేంద్రం స్పందించింది. టమాట ధరలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉందో చెప్పింది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంట అధికంగా మార్కెట్లోకి సరఫరా అయితే రిటైల్ ధరలు దిగిరావొచ్చని అంచనా వేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. టమాటా ధరల పెరుగుదలకు సంబంధించి రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలోని నాసిక్, నార్యంగావ్, ఔరంగాబాద్ బెల్ట్‌తో పాటు మధ్యప్రదేశ్ నుంచి కొత్త పంట భారీగా సరఫరా జరిగితేనే టమాటా ధరలు దిగివస్తాయని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. టమాటా ధరల్లో ప్రస్తుత పెరుగుదల రైతులను మరింతగా టమాటా సాగు చేసేందుకు ప్రోత్సహిస్తుందన్న కేంద్రమంత్రి.. రాబోయే కాలంలో ఇది ధరలను స్థిరీకరించేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.