ఆ కంటెంట్‌ను తొలగించాలంటూ.. సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక

-

సోషల్ మీడియాలో విచ్చలవిడి తనానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే కేంద్ర సర్కార్ పలు చర్యలు చేపట్టింది. తాజాగా ఈ దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్​ను తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే తక్షణమే అలాంటి కంటెంట్​ను తొలగించాలని సోషల్ మీడియా సంస్థలైన ఎక్స్‌ (ట్విటర్‌), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది. లేదంటే సురక్షిత ఆశ్రయం హోదాను కోల్పోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ఆయా వేదికల నుంచి తొలగించాలని సామాజిక మాధ్యమ సంస్థలైన ఎక్స్‌ (ట్విటర్), యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. శాశ్వతంగా తొలగించడం లేదా అటువంటి కంటెంట్‌ను యాక్సెస్‌ చేయనీయకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని ఈ శాఖ అధికారులు సూచించారు. వీటితోపాటు భవిష్యత్తులో ఇటువంటి కంటెంట్‌ను నిరోధించడానికి పర్యవేక్షణ, నియంత్రణ, రిపోర్టింగ్‌ అల్గారిథంలలో మార్పులు చేసుకొని, అమలు చేయాలని స్పష్టం చేశారు.

దీనిపై తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టకపోతే.. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 79 కల్పిస్తోన్న సురక్షిత ఆశ్రయం హోదాను ఉపసంహరించుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version