చంద్రయాన్-3 వ్యోమనౌక మరికొద్ది గంటల్లో జాబిల్లిపై అడుగుపెడుతుంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేస్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే ఆ అపురూప ఘట్టాన్ని దేశమంతా చూడాలనే ఉద్దేశంతో లైవ్ ప్రసారం చేయాలని ఇప్పటికే ఇస్రో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ఏర్పాట్లు కూడా చేస్తోంది.
అయితే ఈ అపురూప క్షణాలను విద్యార్థులు కూడా వీక్షించేలా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటల సమయానికి ‘చంద్రయాన్-3’ చంద్రుడిపై దిగే ప్రక్రియను ఇస్రో ప్రత్యక్ష ప్రసారం చేయనున్న విషయం తెలిసిందే.
వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్, డీడీ నేషనల్ మాధ్యమాల ద్వారా ఆ అరుదైన దృశ్యాలను వీక్షించవచ్చని ఇస్రో తెలిపింది. ఈ నేపథ్యంలో పాఠశాలలు, విద్యాసంస్థల్లో సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని యోగి ఆదేశించారు.