యాపిల్ కంపెనీ కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఐఫోన్ ధరలను తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీని 20 నుంచి 15 శాతానికి కేంద్రం తగ్గించిన నేపథ్యంలో ఐఫోన్ ధరలు 3 నుంచి 4 శాతం మేర తగ్గాయి. ప్రో మోడల్ ధరను 5 వేల 100 రూపాయలు, ప్రో మ్యాక్స్ మోడల్ ధరను 6 వేలు రూపాయల మేర తగ్గించిన యాపిల్.. దేశీయంగా తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలను స్వల్పంగా తగ్గించింది.
యాపిల్ ప్రస్తుతం 13, 14, 15 బేసిక్ మోడళ్లను దేశీయంగా తయారు చేస్తుండగా.. ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లను దిగుమతి చేస్తోంది. ఇక ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.2300 మేర తగ్గింది. తాజా ధరలను యాపిల్ తన వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. యాపిల్ కొత్త మోడళ్లు లాంచ్ చేసినప్పుడు మాత్రమే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తుంది. కానీ, యాపిల్ తొలిసారి ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలను తగ్గించడం గమనార్హం. దేశీయంగా తయారైన ఫోన్లకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీంతో తగ్గింపు స్వల్పంగానే ఉంది.