ఏకధాటి వర్షాలు కురుస్తున్నందున బ్రిడ్జి నిర్మాణం కొన్నిరోజుల వరకు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. అయినా పట్టించుకోని కాంట్రాక్టర్ నిర్మాణాన్ని కొనసాగించారు. కానీ వర్షం ధాటికి ఆ వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘన ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన అధికారులు.. వంతెన కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
దుర్గ్ జిల్లా ధమ్ధా మండలంలోని సిల్లి, నన్‌కట్టి గ్రామాలను కలిపేందుకు శివ్‌నాథ్ నదిపై సాగ్ని ఘాట్ వద్ద ఓ వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్లపై స్టేజింగ్, షట్టరింగ్ పనులు పూర్తి చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగ్రా రిజర్వాయర్ నిండగా.. శివ్‌నాథ్ నదిలోకి నీటిని విడుదల చేశారు. నీటిమట్టం పెరిగి వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ కూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా.. అధికారులు స్పందించారు. తాజా ఘటనతో బ్రిడ్జ్ పనులు మరింత జాప్యం కానున్నాయి.