ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటి విడతలో భాగంగా ఈనెల 7వ తేదీ 20 స్థానాలకు పోలింగ్ జరగగా.. ఇవాళ మిగిలిన 70 శాసనసభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల బరిలో 958 మంది అభ్యర్థులు ఉండగా వారిలో 130 మంది మహిళలు ఒక ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 1,63,14,479 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 91,41,624 పురుషులు, 81,72,171 మంది మహిళలు, 684 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.
రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 18,833 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అందులో మొత్తం మహిళా ఉద్యోగులు ఉండే పోలింగ్ కేంద్రాలు 700 ఉన్నాయి. ఈ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్పీ, ఆప్, జేడీయూ పార్టీలు బరిలో నిలవగా ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీల మధ్యే కొనసాగుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్.. ఈసారైనా ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా పాతాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మరోవైపు నక్సల్స్ ప్రభావిత రాజిమ్ జిల్లాలోని బింద్రానవాగఢ్ స్థానంలోని 9 పోలింగ్ బూత్‌ల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.