దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మరోవైపు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఓటు వేశారు.
తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి బైక్‌పై వచ్చి ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఓటు వేయగా.. మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిక్కింలోని సోరెంగ్‌లోని పోలింగ్ స్టేషన్ వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రజలు క్యూ కట్టారు. మణిపూర్ ఇంఫాల్‌లోని ఓ పోలింగ్ బూత్ వెలుపల ఓటింగ్‌కు ముందు మహిళలు పూజలు నిర్వహించారు. మరోవైపు కోయంబత్తూర్ లో సద్గురు ఓటు వేశారు. రాందేవ్ బాబా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.