వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లును కాంగ్రెస్, ఎంఐఎం సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఈ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేశారు. ఈ బిల్లులో నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని.. వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని తెలిపారు. ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయం ప్రతి పత్తిని దెబ్బతీస్తుందని కాంగ్రెస్ ఎంపీ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఇక వివాదాస్పద వక్ఫ్ (సవరణ) బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడంతో దేశంలోని పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలోని పలు చోట్ల ముస్లింలు.. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. మరోవైపు తమిళనాడులో సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.