పార్లమెంట్ ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ల నియామకం కొత్త వివాదానికి తెరలేపింది. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ వీరిని ఎంపిక చేయనుంది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2023 నాటి తీర్పును అనుసరించి ఈ నియామకాలు చేపట్టేలా ఆదేశాలివ్వాలని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
గత నెల ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా.. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. దీంతో ఖాళీ అయిన స్థానాల్లో.. ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మార్చి 15లోగా కొత్త కమిషనర్ల పేర్లను ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత జయా ఠాకుర్ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు.