ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడి రాజుకుంటున్నాయి. ప్రధాన పార్టీలు తమ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు సీట్ల పంపకంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా తాజాగా ఉండవల్లిలోని టీడీపీఅధినేత చంద్రబాబు నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు ఈ భేటీలో కసరత్తు చేస్తున్నారు.
ఈ సమావేశానికి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, బీజేపీ జాతీయ నేత జయంత్ పండాతో పాటు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. కాసేపట్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించగా బీజేపీకి కేటాయించే స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.