గుడ్‌న్యూస్‌: తోక ముడుస్తున్న‌ క‌రోనా

మాన‌వాళిని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుతోంది. భార‌త్‌లో ఈ వైర‌స్ తోక‌ముడిచే దిశ‌గా క‌దులుతోంది. కొద్దిరోజులుగా దేశంలో రోజువారీగా న‌మోదు అవుతున్న పాజిటివ్ కేసులు భారీగా త‌గ్గుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కొవిడ్‌-19 త‌న ప్ర‌భావాన్ని కోల్పోతున్నట్లుగా గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇదే విష‌యాన్ని విశ్లేష‌కులు కూడా అంచ‌నా వేస్తున్నారు. నిజానికి భార‌త్‌లో మార్చి, ఏప్రిల్‌, మే నెల‌లో చాలా త‌క్కువ‌గా కేసులు న‌మోదు అయ్యాయి. ఆ త‌ర్వాత నాలుగైదు రోజుల కింద‌టి వ‌ర‌కు కూడా రోజుకు సుమారు ల‌క్ష‌కు చేరువ‌లో కేసులు న‌మోదు అయ్యాయి. అయితే.. రెండుమూడు రోజులుగా దేశంలో కరోనా వైర‌స్ కేసుల‌ గ్రాఫ్‌ మెల్లగా కిందికి వస్తున్నది.

గ‌త ఆదివారం దేశవ్యాప్తంగా 92,605 కొత్త కేసులు, 1,133 మరణాలు నమోదు అయ్యాయి. సోమవారం 86,961 కొత్త కేసులు, 1,130 మరణాలు నమోదయ్యాయి. కాగా.. మంగళవారం ఇది మరింతతగ్గి.. కొత్తకేసుల సంఖ్య 75,083కి పడిపోయింది. అంటే.. ఇది దాదాపు నెల రోజుల వ్యవధిలో అత్యల్పం. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. కరోనా మరణాల సంఖ్య 1,053కి తగ్గింది. మరోవైపు, వైర‌స్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. సోమవారం నుంచి మంగళవారానికి ఒక్కరోజులోనే రికార్డుస్థాయిలో 1,01,468 మంది కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కరోనా వైర‌స్ ప్ర‌భావం క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు స్పష్టమవుతున్నదని విశ్లేష‌కులు చెబుతున్నారు.