46శాతం కొత్త ఎంపీలపై క్రిమినల్​ కేసులు.. ఏడీఆర్ నివేదిక

-

లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 543మంది విద్య, వారిపై నమోదైన కేసులపై అసోషియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్‌-ADR ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది. కొత్తగా ఎన్నికైన వారిలో 46శాతం మందిపై అంటే 251మందిపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిపింది. వారిలో 27మంది దోషులుగా తేలారని చెప్పింది. పార్లమెంటు దిగువ సభ సభ్యుల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కోవడం ఇప్పుడే ఎక్కువని పేర్కొంది.

ఈ ఏడాది 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదుకాగా వారిలో 170 మందిపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదైన ఎంపీల సంఖ్య కూడా ఈసారే ఎక్కువ. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు 15 మంది కొత్త ఎంపీలపై కేసులు నమోదయ్యాయి. వారిలో ఇద్దరిపై అత్యాచారం ఆరోపణల కేసులు ఉన్నాయి.

నలుగురు ఎంపీలపై అపహరణ, 43 మందిపై విద్వేష ప్రసంగం కేసులు నమోదైనట్లు ADR పేర్కొంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో క్రిమినల్ కేసులు నమోదైన అభ్యర్థుల్లో విజయం శాతం 15.3గా ఉంది. అదే ఎలాంటి మచ్చలేనివారు 4.4శాతంగా మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించినట్లు ADR విశ్లేషణలో వెల్లడైంది.

Read more RELATED
Recommended to you

Latest news