దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. మనీష్‌ సిసోదియా సహాయకుడి అరెస్టు

-

లిక్కర్ స్కామ్‌లో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా సహాయకుడిని ఇవాళ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్స్‌ చీఫ్‌ విజయ్‌ నాయర్‌ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఈడీ ప్రకటించింది. మనీలాండరింగ్‌ కేసు కింద ఈడీ విచారించేందుకు అతడిని కస్టడీకి కోరనుంది. ఇప్పటికే దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఇతడు, వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి సీబీఐ కస్టడీలో ఉన్నారు. కాసేపు విజయ్‌ నాయర్‌ బెయిల్‌ పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడీ అదుపులోకి తీసుకొని అరెస్టు చూపడం గమనార్హం. కొంతమంది లిక్కర్‌ వ్యాపారుల కోసం లాబీయింగ్‌ చేసినట్లు విజయ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

నాయర్‌ గతంలో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేశారు. ఆయనకు ఆప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే ఇండోస్పిరిట్‌ ప్రమోటర్‌ సమీర్‌, పెర్నోడ్‌ రికార్డ్‌ జీఎం బాబు, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌చంద్రా రెడ్డిని అరెస్టు చేసింది. దాదాపు 169 చోట్ల తనిఖీలను నిర్వహించింది. ఇప్పటికే ఈ కేసులో దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు పలువురు అధికారులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news