దేశ రాజధాని దిల్లీలో ఇటీవల ఐఏఎస్ కోచింగ్ సెంటర్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీలో భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోచింగ్ కేంద్రాలను నియంత్రించడానికి ఒక చట్టాన్ని తీసుకువచ్చే యోచనలో ఉంది. త్వరలోనే ఈ చట్టం కార్యరూపం దాల్చుతుందని దిల్లీ విద్యాశాఖ మంత్రి అతీశి ప్రకటించారు.
“చట్టాన్ని రూపొందించడానికి ప్రభుత్వ అధికారులు, వివిధ కోచింగ్ కేంద్రాలకు చెందిన విద్యార్థులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హత, ఫీజు నియంత్రణ, తప్పుదోవ పట్టించే ప్రకటనలను నిరోధించే నిబంధనలు ఈ చట్టంలో పొందుపరుస్తాం. దిల్లీ మునిసిపల్ కార్పొరేషన్-ఎంసీడీ చట్టాలను ఉల్లంఘిస్తూ బేస్‌మెంట్లను ఉపయోగించే కోచింగ్ కేంద్రాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. రాజిందర్ నగర్, ముఖర్జీ నగర్, లక్ష్మీ నగర్, ప్రీత్ విహార్‌లో 30 కోచింగ్ సెంటర్ల బేస్‌మెంట్లను సీల్ చేశాంరు. మరో 200 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేశాం. ఆమె తెలిపారు. ఓల్డ్ రాజిందర్ నగర్ సంఘటనపై మెజిస్టీరియల్ దర్యాప్తు నివేదికలో ఎవరైనా అధికారులు దోషిగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి అతీశి తెలిపారు.