దిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రాజుకుంది. పాలనాపరమైన వ్యవహారాల్లో దిల్లీ మంత్రులు సహకరించడం లేదని ఎల్జీ వీకే సక్సేనా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఆయా శాఖల పనితీరుపై చర్చించేందుకు మంత్రులను సమావేశాలకు పిలిచినా సాకులు చెబుతూ నిరాకరిస్తున్నారని పేర్కొంటూ లేఖ రాశారు. దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నవేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
సీఎం కేజ్రీవాల్ అరెస్టు, తదనంతర పరిణామాల నేపథ్యంలో.. దిల్లీలో రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసేందుకు మంత్రులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం అవసరం అని ఎల్జీ అన్నారు. ప్రజారోగ్యం, వేసవి కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు ఈనెల 2న సమావేశానికి పిలిచినా.. మంత్రులు గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లు నిరాకరించారని కేంద్రం హోంశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నియమావళిని సాకుగా చూపారని, వారు బాధ్యతగా వ్యవహరించడం లేదని ఆరోపించారు.