భారత్లో మద్యం, ఇతర మత్తు పదార్థాలు వాడే వారు 37 కోట్ల దాకా ఉన్నారట. ఇక తెలంగాణలో అయితే 82 లక్షల దాకా ఉన్నట్లు.. సామాజిక న్యాయం, సాధికార వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. ఇలాంటివారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 85 లక్షల దాకా ఉన్నట్లు గురువారం రోజున పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఇది యువతరాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని.. వీటి నుంచి యువతను బయట పడేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, శిక్షణ కేంద్రాలు, ఎన్‌జీవోలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.
దేశంలో 18-75 ఏళ్ల వయసున్నవారిలో 21.70 కోట్ల మంది వివిధ రకాల మత్తుపదార్థాలు వాడుతున్నట్లు పార్లమెంటరీ స్థాయూ సంఘం పేర్కొంది. మరో 16 కోట్ల మంది మద్యం తాగుతున్నారని.. మత్తుపదార్థాల వినియోగం కారణంగా తీవ్రంగా ప్రభావితమవుతున్న రాష్ట్రాల్లో ఏపీ, అస్సాం, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, బిహార్, ఝార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దిల్లీ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఉన్నట్లు స్థాయీసంఘం నివేదికలో పేర్కొంది.