కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వానలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. కుంభవృష్టితో అక్కడి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వర్షాల ధాటికి వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనలో శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు.
రంగంలోకి దిగిన కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కేఎస్‌డీఎంఎ) బాధిత ప్రాంతాలకు ఫైర్‌ఫోర్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్నూర్ డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ బృందాలు కూడా రెస్క్యూ ప్రయత్నాల్లో భాగం అయ్యాయి. కొండచరియలు కింద చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. భారీ వర్షాల కారణంగానే కొండచరియలు విరిగిపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.