లోక్ సభ ఎన్నికల వేళ దిల్లీలో రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. ఓవైపు ఆప్, మరోవైపు బీజేపీ విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా ఆప్ మంత్రి ఆతిశీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీజేపీపై ఆమె చేసిన వ్యాక్యలపై ఈసీ స్పందిస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఏమైందంటే?
భారతీయ జనతా పార్టీలో చేరాలని కొందరు ప్రైవేటు వ్యక్తులు తనను సంప్రదించారని ఇటీవల ఆప్ నాయకురాలు, దిల్లీ ఆర్థిక శాఖ మంత్రి ఆతిశీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మేరకు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ.. ఈ అంశంలో తాను చేసిన ప్రకటనకు సరైన ఆధారాలు చూపించాలని కోరింది.
బీజేపీకి చెందిన కొందరు తమ పార్టీలో చేరమని తనను సంప్రదించారని, ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించానని అతిశీ కొద్దిరోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన కమలం పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ.. ఆప్ నేత అతిశీ చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరాలని అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే అతిశీకి నోటీసులు జారీ అయ్యాయి.