దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles)వాడకాన్ని పెంచేందుకు కేంద్రం గతంలోనే వాహనదారులకు సబ్సిడీని అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే విద్యుత్‌తో నడిచే వాహనాలను కొనేవారికి సబ్సిడీని అందిస్తున్నారు. అయితే సబ్సిడీని అందించేందుకు కేంద్రం గతంలో మార్చి 31, 2022 ను డెడ్ లైన్ గా ప్రకటించింది. కానీ ఆ గడువును ఇప్పుడు మళ్లీ పెంచారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం అందిస్తున్న సబ్సిడీకి గాను గడువును కేంద్రం పెంచింది. మార్చి 31, 2022 వరకు ఉన్న గడువును మార్చి 31, 2024 వరకు పెంచింది. దీంతో అప్పటి వరకు వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సిడీలను పొందవచ్చు.
కాగా ఫేమ్ 2 స్కీమ్ కింద కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లకు అందిస్తున్న సబ్సిడీని 50 శాతం వరకు కేంద్రం పెంచింది. ఈ క్రమంలో ప్రతి కిలోవాట్ అవర్‌కు రూ.15వేల వరకు సబ్సిడీ లభిస్తుంది. అందు వల్లే హీరో, టీవీఎస్ వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలను తగ్గించాయి.
2019లో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తారు. అందుకు గాను అప్పట్లోనే రూ.10వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇక ఈ స్కీమ్ కింద గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తూ 80 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఎలక్ట్రిక్ టూవీలర్లకు సబ్సిడీని అందిస్తారు.