ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’లాంటివి.. మస్క్‌ ట్వీట్‌ వేళ రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

-

పోలింగ్ సమయంలో ఈవీఎంలకు హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించాలంటూ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తాజాగా చేసిన ట్వీట్‌ ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది. దీనిపై  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌లు కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత్‌లోని ఈవీఎంలు ‘బ్లాక్‌ బాక్స్‌’లాంటివని.. వాటిని పరిశీలించడానికి ఎవరికీ అనుమతి ఉండదని రాహుల్ గాంధీ అన్నారు. దీంతో దేశ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై తీవ్రమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత సంస్థల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు.. ప్రజాస్వామ్యం మిథ్యగా మారి, మోసాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శలు చేశారు.

టెక్నాలజీ అనేది సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిందని.. ఒకవేళ అదే సమస్యలకు కారణమైతే దాన్ని పక్కన పెట్టాలని అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు వాటి ట్యాంపరింగ్‌ ముప్పు గురించి బహిరంగంగా చెబుతున్నా.. మన దేశంలో మాత్రం వాటినే ఉపయోగించాలని పట్టుబట్టడం వెనుక కారణమేంటో బీజేపీ  స్పష్టం చేయాలని అఖిలేశ్ యాదవ్  డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news