దేశవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటికే ఎన్నో లక్షల మంది చనిపోయిన విషయం విదితమే. కొందరు హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటూ మృతి చెందగా, కొందరు చికిత్స అందక హాస్పిటళ్ల బయట చనిపోయారు. మరికొందరు ఇళ్లలోనూ మృతి చెందారు. అయితే కోవిడ్ బారిన పడి చనిపోయిన వ్యక్తులకు చెందిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఆ పిటిషన్‌ను ధర్మాసనం విచారించి బాధితులకు నష్ట పరిహారం చెల్లించే విషయాన్ని ఆలోచించాలని కేంద్రానికి సూచించింది. అయితే కొన్ని లక్షల్లో బాధితులు ఉన్నారు కనుక అందరికీ నష్ట పరిహారం చెల్లించలేమని కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో వాదోపవాదనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కోవిడ్‌తో చనిపోయిన వారి పేరిట డెత్ సర్టిఫికెట్‌లను జారీ చేయడం కోసం కేంద్రం తాజాగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటిని సుప్రీంకు కేంద్రం సమర్పించింది. ఆ మార్గదర్శకాల పట్ల సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది.
కానీ కోవిడ్ వచ్చిన వారు కోలుకున్నాక పలు ఇతర కారణాల వల్ల కూడా చనిపోయి ఉంటారని, అందువల్ల ఆత్మహత్య చేసుకున్న వారు కూడా అదే జాబితాకు చెందుతారని, వారి ప్రత్యేక నష్టపరిహారం ఏదీ ఉండదని మార్గదర్శకాల్లో ఉంది. కానీ సుప్రీం ఇందుకు అభ్యంతరం తెలిపింది. కోవిడ్ వచ్చిన వారు తీవ్రంగా డిప్రెషన్‌కు లోనై వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని, కనుక వారి కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇచ్చే విషయాన్ని కేంద్రం ఆలోచించాలని కోర్టు సూచించింది. కాగా విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. దీంతో ఆ రోజు పై విషయం మీద స్పష్టత రానుంది.
అయితే కేంద్రం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తులకు చెందిన కుటుంబ సభ్యులు మరింత తేలిగ్గా, సులభంగ డెత్ సర్టిఫికెట్లను తీసుకోవచ్చు. దీంతో భవిష్యత్తులో నష్ట పరిహారం వచ్చేలా ఉంటే వారికి సులభంగా పరిహారం అందుతుంది.