అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
కమిటీ ఏర్పాటు చేస్తామని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై తీర్పు వెల్లడిస్తూ కమిటీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లోగా ధర్మాసనానికి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
గతంలో కేంద్రం సమర్పించిన ప్రతిపాదనలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. నిపుణుల కమిటీని తామే నియమిస్తామని గత విచారణలో తెలిపిన సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు ఇవాళ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.