కరోనా బారిన పడిన వారు అందరూ హాస్పిటల్‌లో చేరాల్సిన అవసరం ఉండదు. కేవలం కొందరికి మాత్రమే హాస్పిటల్‌లో చికిత్సను అందించాలి. కోవిడ్ బారిన పడ్డ వారిలో 12-15 శాతం మందికి హాస్పిటల్ లో చికిత్స అవసరం అవుతుంది. అయితే కోవిడ్ పేషెంట్లు ఎక్కువగా ద్రవాలను కోల్పోతారు కనుక వారు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ద్రావణం తాగితే శరీరంలో ద్రవాలు తిరిగి చేరడంతోపాటు కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
కోవిడ్ సోకిన వారిలో డయేరియా, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. దగ్గు కూడా వస్తుంది. దీంతో శరీరంలోని ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్‌ను త్వరగా కోల్పోతారు. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడతారు. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. ఫలితంగా కోవిడ్‌పై పోరాడేందుకు శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు కూడా లభిస్తాయి. దీంతో కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఓఆర్ఎస్ ద్రావణం తాగాలని చెబుతున్నారు.
ఓఆర్ఎస్ ద్రావణ ప్యాకెట్లు మెడికల్ షాపుల్లో పౌడర్ రూపంలో లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసేందుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. అందువల్ల ఆ ప్యాకెట్లను ఎవరైనా కొనవచ్చు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లలో ఉండే పొడిని వాటిపై సూచించిన విధంగా నీటిలో కలుపుకుని తాగాలి. గంటకు ఒకసారి 120 ఎంఎల్ మోతాదులో ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగాలి. అలాగే 3-4 గంటలకు ఒకసారి మూత్ర విసర్జన చేయాలి. దీంతో త్వరగా ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. అయితే ఇంట్లోనూ ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు.
ఒక లీటర్ నీటిని తీసుకుని మరిగించి చల్లార్చాలి. అందులో అర టీస్పూన్ ఉప్పు, 5-6 టీస్పూన్ల చక్కెర కలపాలి. దీంతో ఓఆర్ఎస్ ద్రావణం తయారవుతుంది. దీన్ని కూడా తాగవచ్చు. దీంతో కోవిడ్ వల్ల వచ్చే డీహైడ్రేషన్ తగ్గుతుంది. కోవిడ్ నుంచి త్వరగా కోలుకుంటారు.