బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా బంగాల్ అసెంబ్లీలోకి ఓ నకిలీ ఎమ్మెల్యే ప్రవేశించిన ఘటన చోటుచేసుకుంది. విధాన సభ గేటు దాటి ప్రధాన భవనం వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. అతడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది అనుమానం వచ్చి ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతణ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో అసెంంబ్లీ భద్రతపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బంగాల్లో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. ఆ ‘ఫేక్ ఎమ్మెల్యే’ అసెంబ్లీ ప్రాంగణంలోకి గేట్ దాటి ప్రవేశించాడు. అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. సహకార శాఖ మంత్రి అరూప్రాయ్ స్థానంలో తాను అసెంబ్లీకి వచ్చానని చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగగా.. హరీష్ ఛటర్జీ స్ట్రీట్ నుంచి వచ్చానని తెలిపాడు. అతడి మాటల్లో పొంతన లేకపోవటం వల్ల చాలా సేపు విచారించి పోలీసులకు అప్పగించారు. అతడు అసెంబ్లీకి ఎందుకు వచ్చాడు? అరూప్ రాయ్ పేరును ఎందుకు ప్రస్తావించాడు? హరీశ్ ఛటర్జీ వీధి గురించి ఎందుకు మాట్లాడాడు? అనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.