మహారాష్ట్రలో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హ్యాండ్ గ్లవ్స్ కర్మాగారంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. వలుజ్‌లోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఈరోజు తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సన్‌షైన్ ఎంటర్ప్రైజెస్ హ్యాండ్ గ్లవ్స్ తయారీ కంపెనీలో సుమారు 25 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాదాపు 15 మంది నైట్ షిఫ్ట్‌లో డ్యూటీ నిర్వహిస్తున్నారు. అయితే వీరు నిద్రిస్తున్న సమయంలో కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొంతమంది కార్మికులకు మెలకువ వచ్చి వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే ఇంకొంత మంది గాఢ నిద్రలో ఉండటం వల్ల ఆలస్యంగా ప్రమాదాన్ని గమనించి బయటకురాలేక సజీవదహనమయ్యారు. మరణించిన ఆరుగురి మృతదేహాలను పోలీసుల పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీ మొత్తం అగ్నికి ఆహుతైందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.