దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ఏడాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని చెప్పారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా మారడంపై ప్రజలు లేఖలు రాసి సంతోషం వ్యక్తం చేశారని.. జీ 20 విజయవంతంపై ప్రజలు లేఖలు రాసి గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని వివరించారు. దేశ ప్రజల్లో వికసిత్, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి రగిలించిందని వెల్లడించారు. 2024లోనూ ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని కోరారు.
“దీపావళి సందర్భంగా దేశీయ తయారీ ద్వారా నిరూపించాం. చంద్రయాన్-3 విజయవంతంపై సందేశాలు వస్తున్నాయి. శాస్త్రవేత్తల కృషితో చంద్రయాన్-3 విజయవంతం అందరికీ గర్వకారణం. ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగింది. ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు దక్కడంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసింది. భారత సృజనాత్మకతను ప్రపంచవ్యాప్తంగా చాటాం. ఈ ఏడాది క్రీడల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రతిభ చూపారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తా చాటారు. వన్డే ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు దోచింది.” అని మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ ఈ ఏడాది జరిగిన అత్యుత్తమ విషయాల గురించి ప్రస్తావించారు.