ఈనెల 24 నుంచి జులై 3వ వరకు 18వ లోక్‌సభ తొలి సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అయితే ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సూచనలు కనిపించడం లేదు. తొలివిడత సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపికకు తీసుకునే సమయాన్ని మినహాయిస్తే మిగిలినవి అయిదు రోజులే ఉంటాయి. ఈ స్వల్పకాలంలో బడ్జెట్ ప్రవేశపెట్టి, దానిపై చర్చించి, ఆమోదించడం సాధ్యం కానందున జులై మూడోవారంలో జరిగే వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. ఎన్నికల సంవత్సరం కావడం వల్ల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
మరోవైపు గత సమావేశాల్లో నిర్మలా సీతారామన్ వరసగా ఏడుసార్లు బడ్జెట్ సమర్పించిన ఘనత సాధించనున్నారు. ఇప్పుడు ఎనిమిదో సారి పద్దు ప్రవేశపెట్టబోతున్నారు. మరోవైపు ఈసారి కొత్త లోక్‌సభ సభ్యుల ప్రమాణ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత స్పీకర్ ఎంపిక ఉంటుంది. 27 నుంచి రాజ్యసభ 264వ సెషన్ ప్రారంభమవుతుంది. ఆరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. రాష్ట్రపతి అనంతరం ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్‌ను పార్లమెంటుకు పరిచయం చేస్తారు.