తమిళనాడులో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీకొట్టిన ఘటనలో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మరణించారు. రెండ్రోజులు సెలవులు రావడంతో కారులో ఆలయానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతులందరూ రాష్ట్రంలోని ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు.
ప్రొద్దుటూరుకు చెందిన గిద్దలూరు నితీష్(21), తిరుపతికి చెందిన యుగేశ్(23), చేతన్(22), కర్నూలుకు చెందిన రామ్మోహన్(21), విజయవాడకు చెందిన బన్ను నితీష్(22), నెల్లూరుకు చెందిన విష్ణు, ప్రకాశం జిల్లాకు చెందిన చైతన్య శనివారం రోజున కారులో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్లి దర్శనం తర్వాత తిరిగి ఆదివారం రాత్రి చెన్నై బయల్దేరగా తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న గిద్దలూరు నితీష్, చేతన్, రామ్మోహన్, యుగేష్, బన్ను నితీష్ స్పాట్ డెడ్ కాగా.. గాయపడిన విష్ణు, చైతన్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.