భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశంలో చదువుకున్న భారతీయ పూర్వ విద్యార్థులకు.. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన షెన్‌జెన్ వీసాలను జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇందుకోసం కొత్త ప్రణాళికను తీసుకొస్తున్నామని ప్రకటించింది. 2030 నాటికి 30వేల మంది భారత విద్యార్థులను ఆహ్వానించడమే తమ లక్ష్యమని తెలిపింది.
ఫ్రాన్స్‌లో భారతీయ విద్యార్థి కనీసం ఒక్క సెమిస్టర్ గడిపినా.. ఇరు దేశాల మధ్య అనుబంధం ఏర్పడుతుందని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం అభిప్రాయపడింది. అందుకే ఫ్రాన్స్‌లో కనీసం ఒక సెమిస్టర్ చదివి ఉండి, భారత్, ఫ్రాన్స్ లేదా మరో దేశంలో గుర్తింపు పొందిన సంస్థల్లో మాస్టర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీ స్థాయికి చేరుకున్న వారు ఈ ఐదేళ్ల కాలపరిమితి కలిగిన షెన్‌జెన్ వీసాకు అర్హులు అని వెల్లడించింది. భారత్‌కు చెందిన పూర్వ విద్యార్థులకు కోసమే ఈ విధానాన్ని తీసుకువచ్చామని.. తద్వారా రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిస్తున్నామని తెలిపింది.