అయింది. అంతా అనుకున్నట్టే అయింది. తగ్గేదేలే అంటూ బంగారం ధర రూ.లక్షకు చేరింది. పసిడి రేటు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక పెరిగిన గోల్డ్ రేటు చూసి సామాన్యులు గుండెలు బాదుకుంటున్నారు. ఇప్పట్లో తాము పసిడి కొనుగోలు చేయడం ఇక కలే అని వాపోతున్నారు. శుభకార్యాల సీజన్ ముందుండటంతో అసలు ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.