దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ చేయడానికి కేంద్ర కేబినెట్ పచ్చ జెండా ఊపింది. దేశ ప్రజలకు మూడు దశలల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పథకానికి శుక్రవారం కేంద్ర కేబినెట్ అనుమతులు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీని కోసం ఇప్పటికే 88.65 ఎల్ఎమ్టీ బియ్యం సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
ఈ బియ్యాన్ని మూడు దశలల్లో పంపణీ చేస్తామని తెలిపారు. మొదటి దశలో పీఎం పోషణ్, ఐసీడీఎస్ కార్యక్రమాల ద్వారా కొన్ని జిల్లాల్లో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు. తర్వాత రెండో దశలో ప్రజా పంపిణీ వ్యవస్థ తో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా 2023 మార్చి వరకు మరి కొన్ని జల్లాలకు ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని తెలిపారు.
2024 మార్చి వరకు మూడో దశ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ బియ్యం పంపిణీ చేసే పథకానికి ప్రతి ఏడాది రూ. 2,700 కోట్లను కేంద్ర ప్రభుత్వ ఖర్చు చేస్తుందని వెల్లడించారు.